Mountain View


సెప్టెంబర్ 2015 కరెంట్ అఫైర్స్ 517


బ్రిటన్‌ను సుదీర్ఘ కాలంగా పరిపాలిస్తున్న రాజ్యాధినేతగా 89 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 9, 2015వ తేదీన రికార్డు సృష్టించారు. ఇంతకుముందు బ్రిటన్‌కు అత్యధిక కాలం రాణిగా కొనసాగిన క్వీన్ విక్టోరియా 63 ఏళ్ల పరిపాలన రికార్డును క్వీన్ ఎలిజబెత్ - 2 అధిగమించారు.

సింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ పై విజయం సాధించింది. 1965లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి పీపుల్స్ యాక్షన్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది.

అవినీతి ఆరోపణలు రావటంతో ఈజిప్టు ప్రధానమంత్రి ఇబ్రహీం మహ్లాబ్ స్తానం లో చమురు శాఖ మంత్రిగా ఉన్న షరీఫ్ ఇస్మాయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సీసీ కోరారు.

మాల్కమ్ టర్న్‌బుల్ ఆస్ట్రేలియా 29వ ప్రధానమంత్రిగా సెప్టెంబర్ 15న ప్రమాణస్వీకారం చేశారు. సెప్టెంబర్ 14న లిబరల్ పార్టీ నిర్వహించిన పార్టీ అంతర్గత ఓటింగ్‌లో మాల్కమ్ టర్న్‌బుల్ ప్రస్తుత ప్రధాని టోనీ అబాట్‌ను ఓడించారు.

నేపాల్‌లో సెప్టెంబరు 20 నుంచి చారిత్రాత్మక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో నేపాల్ పూర్తి స్థాయి లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. నేపాల్ రాచరికం 2008లో రద్దయింది. ఏడు రాష్ట్రాల తో సమాఖ్య ఏర్పడుతుంది.

ఐక్యరాజ్యసమితిలో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించిన చర్చా పత్రానికి ఐరాస సర్వప్రతినిధి సభ సెప్టెంబరు 14న ఆమోదం తెలిపింది.భద్రతామండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాన్ని ఏవిధంగా విస్తరించాలి వంటి అంశాలు దీనిలో ఉన్నాయి.

అలెక్సిస్ సిప్రాస్ సెప్టెంబరు 21న గ్రీసు ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యారు. గ్రీసు పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సిప్రాస్ సమీప ప్రత్యర్థి న్యూ డెమొక్రసీ నాయకుడు వాంగెలిస్ మీమరాకిస్‌ పై విజయం సాదించారు .

గోమాతను పవిత్రంగా భావించే నేపాల్‌లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు. కొత్త రాజ్యాంగంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా పరిగణించాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ చివరికి ఆవును ఎంపికచేశారు. దీంతో దానికి రాజ్యాంగ రక్షణ కల్పించినట్లయింది.

భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాలతో జీ-4 సదస్సు సెప్టెంబరు 26న న్యూయార్క్‌లో జరిగింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి జీ-4 దేశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని జీ-4 దేశాలు ప్రకటించాయి. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌లు పాల్గొన్నారు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇండో-పసిఫిక్ సముద్ర తీరప్రాంతాల సంరక్షణకు కలసి పనిచేయాలని భారత్, జపాన్, అమెరికాలు నిర్ణయించాయి. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 29న నిర్వహించిన త్రైపాక్షిక మంత్రుల చర్చల్లో విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, ఫ్యుమియో కిషిడా, జాన్ కెర్రీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.