Mountain View


అసలు ఎంటీ వ్యాపం ?830

       వ్యాపం అంటే హిందీలో ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు . రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ మొదలైన కోర్సులతో పాటు ఉపాధ్యాయులు, పోలీసులు, ఫారెస్టు గార్డులు మొదలైన ఉద్యోగాల అభ్యర్ధులకు కూడా పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని.

      ఈ సంస్ధలోని ఉన్నతాధికారులు అవకతవకలకు పాల్పడుతూ పరీక్షలను, పరీక్ష పత్రాలతో పాటు అభ్యర్ధులను కూడా భారీ మొత్తంలో రిగ్గింగ్ చేసేవారు . నిందితుల కంప్యూటర్ లలోని సమాచారాన్ని వెలికి తీసి విశ్లేషించిన ప్రశాంత్ పాండే ప్రకారం కుంభకోణం ప్రధానంగా మూడు పద్ధతుల్లో జరిగింది.

      ఒక పద్ధతి, పరీక్ష రాసేవారిని మార్చివెయ్యడం. ఈ పద్ధతిలో అడ్మిట్ కార్డులను ముఖ్య సాధనంగా వినియోగించారు. అక్రమంగా సీటు లేదా ఉద్యోగం సంపాదించాలనుకున్నవారు మామూలుగానే అందరితో పాటు దరఖాస్తు చేస్తారు. వారి ఫోటోలు అవీ దరఖాస్తులపై ఉంటాయి. అడ్మిట్ కార్డు పైన కూడా వారి ఫోటో ఉంటుంది. సరిగ్గా పరీక్ష జరగడానికి ముందు అడ్మిట్ కార్డులోని ఇతర సమాచారాన్ని అలాగే ఉంచి అభ్యర్ధి ఫోటో మార్చేవారు. అభ్యర్ధి ఫోటో స్ధానంలో తాము ముందే మాట్లాడుకుని ఉంచుకున్న తెలివైన అభ్యర్ధులు లేదా అప్పటికే ఆ సీటు లేదా ఉద్యోగం పొందినవారి ఫోటోని అతికిస్తారు. ఆ విధంగా అసలు అభ్యర్ధికి బదులు సమాధాన పత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగల వ్యక్తులు పరీక్ష రాసేస్తారు. పరీక్ష ముగిసిన అనంతరం అక్రమ రాతగాడి ఫోటోను తొలగించి మళ్ళీ అసలు అభ్యర్ధి ఫోటోని అతికించేవారు.

      ఇంకో అక్రమ పద్ధతిని ఇంజన్-బోగీ పద్ధతి అనవచ్చు. అనగా తెలివైన అభ్యర్ధి, అక్రమంగా సీటు లేదా ఉద్యోగం పొందుతున్న అభ్యర్ధి ఇద్దరూ పరీక్ష రాయడం. రైలుని లాగే ఇంజన్ కి బోగీలు తగిలించినట్లుగా పరీక్షలను లాగే తెలివైన ఇంజన్ కి అర్హతలు లేని అభ్యర్ధిని బోగీగా తగిలించడం. ఇందులో కూడా బోర్డు ఉన్నతాధికారుల హస్తం కావాలి. ముందే మాట్లాడుకున్న ఇంజన్ అభ్యర్ధికి ముందూ వెనక గానీ పక్కన గానీ బోగీ అభ్యర్ధి వచ్చేలా ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత పరీక్షలో కాపీ జరుగుతుంది. బోగీ అభ్యర్ధికి అంతా కనపడేలా ఇంజన్ అభ్యర్ధి తన సమాధాన పత్రాన్ని ఉంచుతూ పరీక్ష రాస్తాడు. ఇంజన్ తో పాటు బోగీ కూడా విజయవంతంగా పరీక్ష పూర్తి చేస్తుంది.

      మూడో పద్ధతిలో అభ్యర్ధులు తమ సమాధాన పత్రాలలో ఏమీ నింపరు. ఖాళీ సమాధాన పత్రాన్ని ఇస్తారు. ఆ తర్వాత వారికి సీటు గానీ, ఉద్యోగం గానీ వచ్చే విధంగా మార్కులు ఇచ్చేట్లుగా ఏర్పాట్లు చేస్తారు. అక్రమంలో భాగం వహిస్తున్న అధికారి సమాచార చట్టం హక్కు కింద సదరు అభ్యర్ధి సమాధాన పత్రం చూపాలని కోరుతూ ఇతరుల పేరుతో పిటిషన్ దాఖలు చేస్తాడు. తద్వారా అభ్యర్ధి సమాధాన పత్రాన్ని చూసే అవకాశాన్ని తనకు తానే కల్పించుకుంటాడు. అలా సమాధాన పత్రాన్ని తీసుకున్నాక అతనికి ఇవ్వబడిన మార్కులకు అనుగుణంగా సమాధానాలను నింపుతాడు. ఆ తర్వాత ఎవరన్నా ఆ సమాధాన పత్రాన్ని తనిఖీ చేసినా జరిగింది ఏమిటో తెలియకుండా ఉంటుందని అక్రమార్కుల అంచనా.

       వ్యాపం సంస్ధ పైన ఆరోపణలు 1995 ప్రాంతంలోనే మొదలయ్యాయి. కానీ అప్పట్లో ఇంత భారీ మొత్తంలో అక్రమాలు చోటు చేసుకోలేదు. 2003 తరువాత దీని పరిది విస్తరించడం మొదలయింది . ఒక పద్దతి ప్రకారం రిగ్గింగ్ చేసే ఒక వ్యవస్థ ఏర్పడింది. ఈ కుంభకోనంలో సాదారన బ్రోకర్లుతొ పాతుగా సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి మరియు గవర్నర్ కుమారులు , భందువులు ఉండడం గమనార్హం.

ఎలా బయటపడింది ?

      2007 లో మధ్య ప్రదేశ్ లోకల్ ఫండ్ ఆడిట్ సంస్ధ అనేకమంది అభ్యర్ధుల దరఖాస్తులు కనిపించని సంగతిని కనుగొంది. ఈ కారణం వల్ల పరీక్షల అడ్మిట్ కార్డులతో దరఖాస్తులను పోల్చుకునే అవకాశం లేకుండా పోయిందని ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. దానితో కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరుతూ డా. ఆనంద్ రాయ్ అనే స్వచ్చంద కార్యకర్త కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఒక కమిటీ నియమించి దర్యాప్తు చేయాలని పురమాయించాడు. ఈ కమిటీ 2011 లో నివేదిక ఇస్తూ 114 మంది ఇతరుల చేత పరీక్ష రాయించడం ద్వారా ప్రీ-మెడికల్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయ్యారని, వారంతా సంపన్న కుటుంబాల వారేనని ధ్రువపరిచింది. ఆంతే కాకుండా 2013లో ఇండోర్ పోలీసులు ఇతరుల కోసం పరీక్షలు రాయడానికి వచ్చిన 20 మందిని నగరంలోని వివిధ హోటళ్ళ నుండి అరెస్టు చేసి విచారణ చేసిన దరిమిలా జగదీష్ సాగర్ అనే రాకేటీర్ నేతృత్వంలోని అక్రమ రాకెట్ బయటపడింది . దీనితొ రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన 9 రకాల పరీక్షల ఫలితాలను పరిశీలించిన తరువాత వందలమంది అభ్యర్ధులను అరెస్టు చేయడం మొదలయింది. వీరిలో సంహా బాగం ఉన్నతాదికారులు , వ్యాపరావేత్తలు పిల్లలే .

మరణాలు , హత్యలు :

       కుంభకోణంలో దారుణమైన ఆసక్తికరమైన విషయం నిందితులు, సాక్షుల మరణాలు. మధ్య ప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ ఇద్దరూ వ్యాపం కుంభకోణంలో నిందితులే . శైలేష్ యాదవ్ అరెస్టు అవుతాడనగా మార్చి 25, 2015 తేదీన ఆయన తన బెడ్ రూమ్ లో చనిపోయి కనిపించారు. ప్రాధమిక పోస్ట్ మార్టం రిపోర్టులో ఆయన తలపై లోతైన గాయం ఉందని వెల్లడి అయింది . నమ్రత దామోర్ ఇండోర్ మెడికల్ కాలేజీ విద్యార్ధిని. 2012లో ఉజ్జయినిలో రైల్వే ట్రాక్ పై శవమై తేలింది. మొదట శవం ఎవరిదో తెలియక పూడ్చిపెట్టిన పోలీసులు, ఆమెది మొదట హత్య అన్నారు. ఆ తర్వాత ఆత్మహత్య అని చెప్పి కేసు మూసేశారు కాని 2014లో ఆమె కూడా వ్యాపం కుంభకోణంలో నిందితురాలిగా వెల్లడి అయింది.

       దానితో ఆమె మరణంపై టి.వి టుడే విలేఖరి అక్షయ్ సింగ్ పరిశోధన ప్రారంభించాడు. జులై 4 తేదీన ఝాబువాలోని నమ్రత తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసి ఇంటినుండి బైటికి వస్తూ అకస్మాత్తుగా నురగలు కక్కుతూ కిందపడి చనిపోయాడు. గుండె ఆగి మరణించాడని పోస్ట్ మార్టం నివేదికలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అప్పటికే అక్షయ్ సింగ్ బెదిరింపులు ఎదుర్కొన్నట్ట్లు వెల్లడయింది . అక్షయ్ సింగ్ మరణం నేపధ్యంలో నమ్రత అటాప్సీపై డాక్టర్లు మళ్ళీ పోస్టుమార్టం చేశారు. ఆమెది ఆత్మహత్య కాదని హత్య చేశారని జులై 7, 2015 తేదీన వెల్లడి అయింది. డా డి.కె.సకల్లే, డా. అరుణ్ శర్మలు జబల్పూర్ లో నేతాజీ మెడికల్ కాలేజీ డీన్ గా పని చేస్తూ అనుమాస్పద రీతిలో మరణించారు. తమ కాలేజీలో వ్యాపం కుంభకోణం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్ధుల జాబితాను తయారు చేస్తున్న క్రమంలోనే ఇద్దరూ చనిపోయారు. డా. సకల్లే అయితే అప్పటికే కొందరు విద్యార్ధులను తొలగించాడు. వారినుండి ఒత్తిడిలు తీవ్రం కావడంతో నెలరోజులు సెలవు పెట్టి ఇంటివద్ద ఉండిపోయారు. ఆయన ఇంటివద్ద ఉండగా జులై 4, 2014 తేదీన ఇంటివెనుక కాలిన గాయాలతో చనిపోయి కనిపించారు.

       ఇవి పత్రికల దృష్టిని ఆకర్షించిన హై ప్రొఫైల్ మరణాల్లో కొన్ని. ఛోటా బ్రోకర్లుగా వ్యవహరించిన వారిలో పలువురు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. కొందరి శవాలు మనుషులు సంచరించని చోట్ల దొరికాయి. కొందరు ఏదో ఒక జబ్బుతో చనిపోయారు. ఆ జబ్బులకు చికిత్స ఉన్నప్పటికీ, చికిత్స పొందగల శక్తి ఉన్నప్పటికీ వారు చనిపోతారు. ఇంకొందరు అకస్మాత్తుగా కారణాలు తెలియకుండా ఆత్మహత్య చేసుకుంటారు. వారికి డిప్రెషన్ వ్యాధి ఉన్నట్లు అప్పుడే కనిపెడతారు. 2009 చివరిలో మొదలైన మరణాలు ప్రతి యేడూ పెరుగుతూ వచ్చాయి. 2015లో ఇప్పటివరకు డజనుకు పైగా చనిపోయారు. లెక్కతేలినవారు 42 మంది ఉండగా అధికారికంగా గుర్తించని హత్యలు ఇంకా ఉన్నాయని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.


ఆదారం: teluguvartalu.com