Mountain View


1971 ..పాక్ పై త్రిశూల వ్యూహం591


​1971... పాక్‌తో రెండో యుద్ధం! ‘తూర్పు పాకిస్థాన్‌’ (బంగ్లాదేశ్‌ ) ఆవిర్భావానికి కారణమైన యుద్ధం! 1971లో పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తూర్పు పాకిస్థాన్‌లో బెంగాలీల ఉద్యమం తారస్థాయికి చేరడంతో ఉద్యమకారులపై పాక్‌ క్రూరమైన అణిచివేత చర్యలకు దిగింది. ఫలితంగా లక్షలాది తూర్పు పాకిస్థానీలు (బంగ్లాదేశీయులు) శరణార్థులుగా భారతలోకి రావడం ప్రారంభించారు. దీనితో పాక్‌తో భారతకు యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధంలో భారత నౌకాదళం ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ పేరిట గొప్ప వ్యూహాన్ని అమలు చేసి కరాచీ నౌకాశ్రయాన్ని దిగ్బంధించింది. 1971 డిసెంబర్‌ 4న సాధించిన ఈ విజయానికి గుర్తుగా భారత నౌకాదళం ప్రతి డిసెంబర్‌ 4ను నేవీ డేగా జరుపుకుంటోంది. ఒక్కసారి ఆ యుద్ధ దృశ్యాలను గుర్తుకు తెచ్చుకుంటే.

పాకిస్థాన్‌ నౌకాదళ ప్రధాన కేంద్రం కరాచీ నగరం. పాక్‌లోని ప్రధాన నౌకాశ్రయం, చమురు నిల్వ కేంద్రం కూడా ఇదే! పాక్‌కు విదేశాల నుంచి పెద్దఎత్తున ఏ సరుకులు రావాలన్నా కరాచీ పోర్టు మీదుగా రావాల్సిందే. ఈ పోర్టును దిగ్బంధం చేసి యుద్ధ నౌకల్ని, రవాణా నౌకల్ని, చమురు కేంద్రాల్ని ధ్వంసం చేస్తే పాక్‌కు చమురు, ఆయుధాల సరఫరా నిలిచిపోతుందని, ఆ తర్వాత పాక్‌పై సునాయాసంగా విజయం సాధించవచ్చని భారత భావించింది. ఇందుకోసం ఆపరేషన్‌ ట్రైడెంట్‌ (త్రిశూల వ్యూహం)కు భారత నౌకాదళం శ్రీకారం చుట్టింది. నాటి నౌకాదళ ప్రధానాధికారి సర్దారీలాల్‌ మథురదాస్‌ నందా ఇందుకు అవసరమైన ప్రణాళికను రచించారు. కమొడోర్‌ బబ్రూభాన్‌ యాదవ్‌ను దీనికి ఇన్‌చార్జిగా నియమించారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన మిసైల్‌ బోట్లను ఇందుకోసం వినియోగించారు. అయితే, ఈ మిసైల్‌ బోట్లకు యుద్ధ విమానాల నుంచి రక్షించుకునే బలమైన వ్యవస్థలు లేవు. అందువల్ల ముందుగా ఈ బోట్లకు పాక్‌ యుద్ధ విమానాల ముప్పును తొలగించాలని భారత భావించింది. కరాచీ సమీపంలోని మస్రూర్‌, బదిన్‌ ఎయిర్‌బే్‌సలపై ముందస్తు వైమానిక దాడి చేసింది. మన మిసైల్‌ బోట్లపై పాక్‌ యుద్ధ విమానాలు దాడి చేయకుండా ముందే నిలువరించడం దీని ఉద్దేశం. ఇందులోని ఎత్తుగడను పాక్‌ కనిపెట్టలేకపోయింది. అవి సాధారణంగా జరిగే బాంబు దాడులేనని భావించింది. ఆ తర్వాత జరగబోయే ‘నౌకాదళ విధ్వంసం’ గురించి ఊహించలేకపోయింది.

ఇలా మొదలైంది.

గుజరాతలోని ఓఖా నుంచి బబ్రూభాన్‌ యాదవ్‌ ఐఎన్‌ఎస్‌ నిపట్‌లో బయలుదేరారు. ఐఎన్‌ఎస్‌ నిర్ఘట్‌, ఐఎన్‌ఎస్‌ వీర్‌ తదితర మిసైల్‌ బోట్లు దానిని అనుసరించాయి. ఈ మిసైల్‌ బోట్ల రాడార్‌ రేంజ్‌ తక్కువ కావడంతో కొన్ని కార్వెట్లను కూడా ఈ బృందంలో చేర్చారు. ఈ నౌకలన్నీ 1971 డిసెంబర్‌ 4 మధ్యాహ్నం కరాచీకి 460 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుని. అక్కడ ఆగిపోయాయి. అంతకుమించి వెళితే... పాక్‌ యుద్ధ విమానాల రేంజ్‌లో అడుగుపెట్టినట్లే. పాక్‌ యుద్ధ విమానాల్లో చాలావాటికి రాత్రి పోరాడే సామర్థ్యం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని భారత యుద్ధ నౌకలు రాత్రిపూట మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి కరాచీకి చేరువయ్యాయి. పాక్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కరాచీకి 130 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్నాయి. అక్కడ తమ రాడార్లను ఉపయోగించి రెండు పాక్‌ నౌకల ఉనికిని గుర్తించాయి. ఐఎన్‌ఎన్‌ నిర్ఘట్‌ నౌక ఒక క్షిపణిని పాక్‌కు చెందిన పీఎన్‌ఎస్‌ ఖైబర్‌ నౌకపైకి ప్రయోగించింది. అయితే, ఇది నౌక నుంచి వస్తున్న క్షిపణి అని ఖైబర్‌ సిబ్బంది తెలుసుకోలేకపోయారు. దానిని విమానంగా పొరబడి విమాన విధ్వంసక శతఘ్నులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆ క్షిపణి నేరుగా వచ్చి ఖైబర్‌ నౌకను తాకి అందులోని ఒక బాయిలర్‌ను పూర్తిగా ధ్వంసం చేసింది. ఆకాశంలోకి పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ నౌకలో లైట్లన్నీ ఆరిపోయి పూర్తిగా చీకటైపోయింది. ఇది నౌకాదళ దాడి అని వారికి అప్పటికీ అర్థం కాలేదు. ‘ఒక యుద్ధ విమానం దాడి చేసింది’ అంటూ పైఅధికారులకు సందేశం పంపించారు. దీంతో పాక్‌ సైన్యం భారత యుద్ధ విమానాల కోసం ఆ ప్రాంతంలో రాడార్లను అప్రమత్తం చేసింది తప్ప నౌకల సంగతి ఊహించలేకపోయింది.

ఈలోగా ఖైబర్‌ సిబ్బందిని రక్షించడానికి పీఎన్‌ఎస్‌ ముహఫిజ్‌ అనే పాక్‌ నౌక అటు బయలుదేరింది. భారత మిసైల్‌ బోట్‌ ఐఎన్‌ఎస్‌ వీర్‌ ఒక క్షిపణిని ప్రయోగించి ‘మహఫిజ్‌’ను పూర్తిగా ధ్వంసం చేసింది. ఆపై ఐఎన్‌ఎస్‌ నిపట్‌ తన పని ప్రారంభించింది. అమెరికా నుంచి పాక్‌కు ఆయుధాలు తీసుకువస్తున్న వీనస్‌ చాలెంజర్‌ అనే నౌకను రెండు క్షిపణులతో ధ్వంసం చేసింది. అలాగే పీఎన్‌ఎస్‌ షాజహాన్‌ అనే పాక్‌ యుద్ధ నౌకను కూడా మరో క్షిపణితో పాక్షికంగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ నిర్ఘట్‌ నౌక మరో క్షిపణిని ప్రయోగించడంతో షాజహాన్‌ పూర్తిగా ధ్వంసమైంది. తమను కాపాడాలంటూ పాక్‌ నౌకాదళ అధికారులు పాక్‌ వైమానిక దళానికి అత్యవసర సందేశం పంపారు. అప్పటికి వైమానిక దళం దానికి స్పందించే స్థితిలో లేదు. ఎందుకంటే కరాచీ పోర్టుకు సమీపంలోని రెండు వైమానిక స్థావరాలపై భారత యుద్ధ విమానాలు అప్పటికే పెద్దఎత్తున దాడి ప్రారంభించాయి.

పాక్‌ ప్రతీకార దాడికి దిగే అవకాశం ఉండడంతో భారత మిసైల్‌ బోట్లను తక్షణం వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. ఆ ప్రకారం అన్ని బోట్లూ వెనక్కి తిరిగి గుజరాతలోని మంగ్రోల్‌కు బయలుదేరే ఏర్పాట్లలో ఉండగా బబ్రూభాన్‌ యాదవ్‌ ఉన్న ఐఎన్‌ఎస్‌ నిపట్‌ మాత్రం కరాచీ పోర్టుకు అతి సమీపానికి వెళ్లింది. కరాచీలోని ప్రధానమైన చమురు ట్యాంకులు, రిఫైనరీలు నిపట్‌లోని రాడార్‌ తెరపై ప్రత్యక్షమయ్యాయి. నిపట్‌ నుంచి రెండు క్షిపణుల్ని వాటిపైకి ప్రయోగించారు. వీటిలో ఒకటి గురితప్పగా, మరొకటి ఒక చమురు డిపోపై పడి దానిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ సమాచారం అందగానే భారత నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. అధికారులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

తిరుగు ప్రయాణం సవాల్‌.

ఐఎన్‌ఎస్‌ నిపట్‌లో ఉన్న బబ్రూభాన్‌ యాదవ్‌కు ఆ నౌకను క్షేమంగా భారతకు చేర్చడం ఒక సవాలుగా మారింది. ఎందుకంటే నౌకలోని చమురు పైప్‌ ఒకటి పగిలిపోయింది. ఇంజిన్‌ రూంలోకి చమురు లీక్‌ కావడం మొదలైంది. రెండు ఇంజిన్లలో ఒకదానిని ఆపివేయాల్సి వచ్చింది. నౌక వేగం సగానికి పడిపోయింది. పాక్‌ యుద్ధ విమానాలుగానీ, నౌకలు గానీ దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో గుజరాతలోని మంగ్రోల్‌కు చేరడం అసాధ్యమని, ప్రమాదకరమని బబ్రూభాన్‌ యాదవ్‌ భావించారు. నౌకను తూర్పు వైపునకు 90 డిగ్రీల కోణంలో తిప్పారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌ వైపు పయనమయ్యారు. భారత యుద్ధనౌక ఒకటి అటువైపు వెళుతుందని పాక్‌ ఎట్టి పరిస్థితుల్లో ఊహించదనేది ఆయన అంచనా. ఆ అంచనా నూటికి నూరుపాళ్లు నిజమైంది. పాక్‌ దాడుల నుంచి నిపట్‌ తప్పించుకోగలిగింది. కానీ, మిగతా యుద్ధనౌకలతో నిపట్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఆ నౌకలన్నీ మంగ్రోల్‌కు, అక్కడి నుంచి ముంబైకి చేరుకున్నాయి. నిపట్‌ పాక్‌ దాడికి గురై ఉండవచ్చని అందరూ ఆందోళన చెందారు. ఈలోగా భారత యుద్ధనౌక ఒకదానిని తాము ధ్వంసం చేసినట్లు పాక్‌ ప్రకటించింది. దీంతో నిపట్‌ మునిగిపోయిందని, బబ్రూభాన్‌ యాదవ్‌, ఆయన సహచరులు చనిపోయారని భారత నిర్ధారణకు వచ్చింది. యాదవ్‌కు ‘మరణానంతర’ శౌర్య పురస్కారాన్ని కూడా ప్రకటించింది. అయితే, పాక్‌ పొరపాటున తమ సొం త యుద్ధ నౌకనే కూల్చివేసుకుందని ఆ తర్వాత వెల్లడైంది. ఐఎన్‌ఎస్‌ నిపట్‌ సముద్రంపై ప్రత్యక్షమైంది. ఒక భారత యుద్ధ నౌక దానిని లాక్కుంటూ తీసుకువచ్చి ముంబైకి చేర్చింది. యాదవ్‌ క్షేమంగా ఉండడం చూసి నౌకాదళ సిబ్బం ది ఆనందం పట్టలేక గంతులు వేశారు. భారత నౌకాదళం తన దేశానికి ఒక చరిత్రాత్మక విజయాన్ని అందించింది.

ఆదారం: andhrajyothy.com